జిల్లావాణి ప్రతినిధి: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని గుర్రపాలెం గ్రామంలో దళితుల శ్మశాన వాటిక సమస్యలు అధ్వానంగా తయారయ్యాయి. సుమారు 1000 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో, ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించడానికి సరైన సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై అంబేద్కర్ సిద్ధాంత ప్రచారకులు నీలపల్లి అప్పారావు మీడియా వేదికగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. అసంపూర్తిగా నిలిచిన పనులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మండల గ్రాంట్ (MPP) నిధుల నుండి ఇక్కడ వాటర్ షెడ్ నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వంపై విమర్శలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు గడుస్తున్నప్పటికీ, నిలిచిపోయిన పనులను పట్టించుకోకపోవడంపై అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రజా ప్రతినిధులు అభివృద్ధి పనులు చేయనప్పుడు, అధికారులే చొరవ తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ ఇక్కడ నాయకులు, అధికారులు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికలో నిలిచిపోయిన వాటర్ షెడ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని, శ్మశానానికి వెళ్లే దారిని, ఇతర కనీస వసతులను మెరుగుపరచాలి.
దళిత వాడలోని ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు త్వరితగతిన స్పందించాలని, అధికారులు ఇప్పటికైనా స్పందించి, గుర్రపాలెం గ్రామ ఎస్సీ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని ఆయన హెచ్చరించారు.


