ఉపాధి హామీ పనులు పారదర్శకంగా జరుగుతున్నాయని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ వి రాజాన వీరసూర్యచంద్ర అన్నారు. సోమవారం గొలుగొండ మండలం సీహెచ్.నాగాపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపిడిఒ ఉలబాల శ్రీనివాసరావు, ఏపీఓ సూర్యమణి, ఇరిగేషన్ జేఈ రవికిరణ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి శ్రామికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం ఉపాధి హామీ పనులు మరింత పారదర్శకంగా జరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, శ్రామికులకు ఉపాధి హామీ పనులు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణాభివృద్ధికి ఉపాధి హామీ పథకం కీలకంగా మారిందన్నారు. ప్రస్తుతం 125 రోజుల పనిదినాల కల్పన ద్వారా పేద కుటుంబాలకు ఉపాధి భరోసా లభిస్తోందన్నారు. రోజుకు 305 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రంలో ఉపాధి పనులు జోరుగా జరుగుతున్నాయని, చెరువుల పూడికతీత, కాలువల శుభ్రత, గ్రామీణ రహదారుల అభివఅద్ధి వంటి పనుల ద్వారా గ్రామాలకు శాశ్వత ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథక కింద పని చేసే శ్రామికులకు ప్రమాదవశాత్తు ప్రాణనష్టం లేదా అంగవైకల్యం జరిగితే ఆర్ధిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన ద్వారా భీమా సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు. దీనికి ఉపాధి హామీలో పని చేస్తున్న శ్రామికులు అర్హులన్నారు.
ఈ సందర్భంగా చోద్యం కోఆపరేటివ్ డైరెక్టర్, జనసేన సీనియర్ నాయకులు రేగుబళ్ల శివ ఆధ్వర్యంలో ఉపాధి శ్రామికులకు లస్సీని సూర్యచంద్ర, ఎంపిడిఒ శ్రీనివాసరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. వేసవి దృష్ట్యా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని సూర్యచంద్ర కొనియాడారు. ఎండ తీవ్రత దృష్ట్యా పనుల్లో పాల్గొంటున్న శ్రామికులకు మజ్జిగ పంపిణీ చేసి వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని అధికారులు, ఫీల్డ్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ డైరెక్టర్ రేగుబళ్ల శివ, టీడీపీ నాయకులు బొప్పన ప్రసాద్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.


