పత్రికా ప్రకటన
మహాశివరాత్రి సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై అధికారుల పరిశీలన
గొలుగొండ మండలం, దారమట్టం గ్రామంలోని శ్రీ దార మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15, 16 తేదీలలో పూజా కార్యక్రమాలు మరియు ప్రత్యేక వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యం మరియు భద్రత దృష్ట్యా పోలీస్ శాఖ తరఫున విస్తృత ఏర్పాట్లు చేపట్టబడుతున్నాయి.
ఈ రోజు నర్సీపట్నం డి.ఎస్.పి శ్రీ పి. శ్రీనివాసరావు గారు, రూరల్ సి.ఐ శ్రీమతి రేవతమ్మ గారు, ఎస్.ఐ శ్రీ రామారావు గారు కలిసి దేవస్థానం మరియు పరిసర ప్రాంతాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్‌ల ఏర్పాట్లు, పార్కింగ్ ప్రదేశాల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు తాగునీరు మరియు ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయం పరిసర ప్రాంతాలలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడినవి.
ఈ సందర్భంగా డి.ఎస్.పి గారు ఎస్.ఐ గారికి బందోబస్తు నిర్వహణపై పలు సూచనలు అందజేసి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో భక్తులు పోలీస్ సిబ్బందికి సహకరించి, క్రమశిక్షణ పాటించాలని కోరడమైనది.
— పోలీస్ శాఖ, గొలుగొండ మండలం

