జగ్గంపేట (కాకినాడ జిల్లా) జిల్లా వాణి : రాష్ట్రంలో ప్రభుత్వం మారి నెలలు గడుస్తున్నా, కొన్ని చోట్ల అధికారుల తీరు మాత్రం మారడం లేదు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామ సచివాలయం వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సచివాలయ భవనంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రం ఇంకా అలాగే దర్శనమిస్తుండటం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. నిబంధనలు బేఖాతరు?రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, ప్రభుత్వ కార్యాలయాలు, పథకాలపై ఉన్న గత ప్రభుత్వ గుర్తులు, నాయకుల ఫోటోలను తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ దాదాపు పూర్తయినప్పటికీ, గుర్రంపాలెంలో మాత్రం అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. స్థానికుల ఆగ్రహంఅధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇంకా పాత చిత్రాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. కొత్త ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంటనే ఆ చిత్రాలను తొలగించి, రంగులు మార్చాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు మౌనంగా ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే గుర్రంపాలెం సచివాలయంపై ఉన్న గత ప్రభుత్వ చిత్రాలను తొలగించి, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

