ఫిబ్రవరి 26 (జిల్లా వాణి ప్రతినిధి):కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే ఆ పసిప్రాణానికి యమపాశమయ్యాడు. ఊహ తెలియని 11 నెలల చిన్నారిని కాలువలోకి విసిరేసి మృత్యుఒడికి చేర్చిన అమానవీయ ఘటన కాకినాడ జిల్లా జగ్గంపేటలో చోటుచేసుకుంది. జగ్గంపేటకు చెందిన వడబోయిన మణికంఠ, సాయి దంపతులు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. అయితే, గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య కుటుంబ కలహాలు తలెత్తుతున్నాయి. మనస్పర్థల కారణంగా తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం మణికంఠ ఆగ్రహంతో ఊగిపోయి, భార్యను మరియు పెద్ద కుమార్తెను చితకబాదాడు. అనంతరం, 11 నెలల చిన్న కుమార్తెను తీసుకుని జగ్గంపేట నుంచి గుర్రంపాలెం వెళ్లే రహదారిలోని పోలవరం కాలువ వద్దకు వెళ్లాడు.మణికంఠ చిన్నారితో సహా కాలువలోకి దూకడాన్ని గమనించిన సమీపంలోని వివేకానంద పాఠశాల వద్ద పనిచేస్తున్న కూలీలు వెంటనే స్పందించారు. గాలింపు చేపట్టి చిన్నారిని బయటకు తీసి, హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పాప మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. “కన్నతండ్రే కాలయముడిగా మారి పసిపాపను బలి తీసుకోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.” ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు మణికంఠను అదుపులోకి తీసుకున్నట్లు జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు.

