జగ్గంపేట, ఫిబ్రవరి 28:విద్యార్థులు కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికితీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. శనివారం జగ్గంపేటలోని శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థల చైర్మన్ బండారు నాగబాబు ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం (సి.వి. రామన్ జయంతి) ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను, సంప్రదాయ వంటకాల ప్రదర్శనను జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులను నవీన్ స్వయంగా పరిశీలించి, వాటి పనితీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన తెలుగువారి సంప్రదాయ వంటకాలను ఆయన రుచి చూసి, చిన్నారుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ.. “ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరుగుతుంది. చిన్ననాటి నుంచే పరిశోధనల పట్ల ఆసక్తి కలిగించడం వల్ల భవిష్యత్తులో వారు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. ప్రతి పాఠశాల ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట, గండేపల్లి మండలాల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, పోతుల మోహనరావు, నాయకులు పాండ్రంకి రాంబాబు, దేవరపల్లి మూర్తి, అడబాల రామాంజనేయులు, జాస్తి వసంత్, రాయి సాయి, పీలా మహేష్ పాల్గొన్నారు.విద్యాసంస్థల ప్రతినిధులు శ్రీ ప్రజ్ఞ డైరెక్టర్ తుమ్మల శ్వేత, కాలేజీ ప్రిన్సిపాల్ కె. అభి, హైస్కూల్ ప్రిన్సిపాల్ అడపా సాయి దీప్తి, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ తోట నాగలక్ష్మి, ఇంచార్జీలు కొల్లా శ్రీనివాస్, పులిగ పవన్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అతిథులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది.

